మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ అరెస్టయి బెయిల్‌పై బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి శనివారం జరిగిన విచారణలో ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు కోర్టుకు వెల్లడించారు. మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల విషయంలో తనకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్నీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్ వదులుకోలేదని కోర్టుకు తెలిపారు.

రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేశారని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేశారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు వివరించారు. అంతేకాదు, మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ బ్రిజ్‌ భూషణ్‌కు క్లీన్‌చీట్‌ ఇవ్వలేదనే విషయాన్ని కూడా పోలీసులు ప్రస్తావించారు. ఈ మేరకు కోర్టుకు నివేదికను సమర్పించారు.

‘‘ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్థాన్‌ వెళ్లిన మహిళా రెజర్లలో ఒకరిని బ్రిజ్‌ భూషణ్‌ తన గదికి పిలిచి గట్టిగా కౌగలించుకున్నాడు.. బాధితురాలు ప్రతిఘటించడంతో ఓ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా అలా చేసినట్లు తన చర్యను సమర్థించుకున్నాడు.. అనుమతి లేకుండా తన చొక్కాను పైకెత్తి అసభ్యంగా ప్రవర్తించాడని మరో మహిళా రెజ్లర్‌ ఫిర్యాదు చేశారు.. ఈ రెండు ఘటనలు బ్రిజ్‌ భూషణ్‌ తన చర్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి’ అని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. బాధితురాలు స్పందించిందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు.. ఆమెకు అన్యాయం జరిగిందనేది వాస్తవం అని వివరించారు.

ఢిల్లీ డబ్ల్యుఎఫ్‌ఐ కార్యాలయంలో జరిగిన మరో సంఘటనను ఢిల్లీ పోలీసులు ప్రస్తావించారు. ఘటన జరిగింది దేశ రాజధాని అధికార పరిధిలో కాదన్న వాదనలకు కౌంటర్ ఇచ్చారు. గుజరాత్‌లోని సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును ప్రస్తావిస్తూ.. ఆ కేసులో వేర్వేరుగా అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, అయితే కోర్టు వాటన్నింటినీ ఒకే చోట విచారించిందని చెప్పారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీ అతడిని నిర్దోషిగా ప్రకటించలేదని ఢిల్లీ పోలీసులు గతంలో కోర్టుకు తెలిపారు.

బ్రిజ్ భూషణ్‌ లైంగిక వేధింపుల ఆరోపణల అంశంపై విచారణకు లెజెండ్రీ బాక్సర్ మేరీ కోమ్ నేతృత్వంలో కేంద్రం కమిటీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. విచారణ పూర్తిచేసి నివేదిక బహిర్గతం చేయని కమిటీ.. ఢిల్లీ పోలీసులకు ఓ కాపీని అందజేసింది. బ్రిజ్‌ భూషణ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు గత ఏప్రిల్ నుంచి ఢిల్లీలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు సహా తదనంతర పరిణామాల నేపథ్యంలో మైనర్‌ ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఇదే సమయంలో మిగతా మహిళ రెజ్లర్లు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై పోలీసులు జూన్ 15న ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసు తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు అక్టోబరు 7కు వాయిదా వేసింది.


Leave A Reply

Your email address will not be published.*